మర్కజ్ తబ్లీగీ జమాత్
మర్కజ్ తబ్లీగీ జమాత్... రెండు మూడు రోజులుగా దేశంలో కరోనావైరస్ వార్తలన్నీ ఈ పదం చుట్టే తిరుగుతున్నాయి.
‘మర్కజ్’ అంటే కేంద్రం.
‘తబ్లీగీ’ అంటే మత ప్రచారం.
‘జమాత్’ అంటే సమూహం లేదా సంఘం.
దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో కరోనావైరస్ చాలా మందికి ప్రబలిన విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక్కడున్న తబ్లీగీ జమాత్‌కు చెందిన మర్కజ్‌లో మార్చి నెలలో ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. దీనికి వేల మంది హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి వచ్చినవారు కూడా అందులో ఉన్నారు.
ఇక్కడ ఇలాంటి కార్యక్రమం జరగడం ఇది కొత్తేమీ కాదు. కానీ, కరోనావైరస్ వ్యాప్తి గురించి తీవ్ర ఆందోళనలు నెలకొన్న సమయంలో దీన్ని నిర్వహించారు.
తబ్లీగీ జమాత్ మాత్రం జనతా కర్ఫ్యూ గురించి ప్రకటించగానే తాము ఈ కార్యక్రమాన్ని ఆపేశామని చెబుతోంది. లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినవారు వెనక్కి వెళ్లలేకపోయారని అంటోంది.
ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం కూడి ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. అక్కడున్నవారిని వెళ్లగొట్టారు. అందరినీ కరోనావైరస్ పరీక్షల కోసం పంపించారు. వారిలో 24 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది.
దీని తర్వాత భారత్‌లో ఒక్కసారిగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య భారీగా పెరగడం మొదలైంది.
తబ్లీగీ జమాత్ నేపథ్యం...
తబ్లీగీ జమాత్ 1926-27లో మొదలైంది. ఇస్లామిక్ స్కాలర్ మౌలానా మహమ్మద్ ఇలియాస్ దీన్ని ప్రారంభించారు. దిల్లీ నుంచి మేవాత్ వరకు ఉన్న వారికి మతపరమైన విద్య అందించేందుకు దీన్ని ఆయన మొదలు పెట్టారని చెబుతారు. ఆ తర్వాత ఇది కొనసాగుతూ వచ్చింది.
తబ్లీగీ జమాత్ మొదటి సమావేశం 1941లో జరిగింది. ఇందులో 25 వేల మంది పాల్గొన్నారు. 1940లలో అవిభాజ్య భారత్ వరకే జమాత్ కార్యకలాపాలు పరిమితమయ్యాయి. అనంతరం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో దీని శాఖలు ఏర్పాటయ్యాయి. జమాత్ కార్యకలాపాల్లో వేగం పెరిగింది. ప్రపంచమంతా వ్యాపించింది. అమెరికా, బ్రిటన్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్‌ల్లో కూడా ఇప్పుడు దీని కేంద్రాలున్నాయి.
తబ్లీగీ జమాత్ అతిపెద్ద సమావేశం ఏటా బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. పాకిస్తాన్‌లోని రాయ్‌విండ్‌లోనూ ఏటా ఓ కార్యక్రమం జరుగుతుంది. వీటిలో పాల్గొనేందుకు వివిధ దేశాల ముస్లింలు వస్తుంటారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ఉన్న జఫర్ సరేశ్వాలాకు తబ్లీగీ జమాత్‌తో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం తబ్లీగీ జమాత్ ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం సంస్థ. 140 దేశాల్లో దీని కేంద్రాలు ఉన్నాయి.
భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో దీని మర్కజ్‌లు (కేంద్రాలు) ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా ఇత్జెమాలు (మత పరమైన శిక్షణకు ప్రవేశాలు తీసుకోవడం) నడుస్తుంటాయి. అంటే, ప్రజలు వస్తూ, పోతూ ఉంటారు.
తబ్లీగీ జమాత్ అంటే జనాల్లో విశ్వాసాన్ని ప్రచారం చేసే సమూహం అని అర్థం. సాధారణ ముస్లింల వరకూ వెళ్లి, వారిలో విశ్వాసాలకు పునరుజ్జీవం పోయడం వీరి లక్ష్యం. ముఖ్యంగా, ఆచారాలు, దుస్తులు, వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలో వీళ్లు బోధిస్తుంటారు.
జమాత్ మత ప్రచారం ఎలా చేస్తుందంటే...
తబ్లీగీ జమాత్ ఆరు ఆదర్శాలు పాటిస్తుంది.
కల్మా: కల్మా చదవడం
సలాత్: ఐదు సార్లు నమాజ్ చేయడం
ఇల్మ్: ఇస్లామిక్ బోధన
ఇక్రామ్ ఎ ముస్లిం: ముస్లిం సోదరులను గౌరవించడం
ఇఖ్లాస్ ఎ నియ్యత్: ఉద్దేశాల్లో నిజాయతీ
దావత్ ఓ తబ్లీగీ: ప్రచారం చేయడం
జమాత్ కార్యక్రమంలో ఏ జరుగుతుంది?
జమాత్ కార్యకలపాలు ఉదయాన్నే మొదలవుతాయి. జమాత్‌లో ఉన్నవారిని ఎనిమిది నుంచి పది మందితో కూడిన చిన్న చిన్న బృందాలుగా విడదీస్తారు. వీళ్లందరినీ జమాత్‌లో హోదాలో అతిపెద్ద వ్యక్తి ఎంపిక చేస్తారు.
ప్రతి బృందాన్నీ పూర్తిగా ఓ కొత్త ప్రాంతానికి వెళ్లమని ఆదేశిస్తారు. ఆయా బృందాల్లో ఉన్నవాళ్లందరూ దీని కోసం కేటాయించుకున్న డబ్బు ఎంత ఉందనేదాన్నిబట్టి ఆ ప్రాంతాన్ని నిర్ణయిస్తారు.
ఆ తర్వాత సాయంత్రం పూట జమాత్‌లో కొత్తగా వచ్చినవారితో ఇస్లాంపై చర్చ జరుగుతుంది.
సూర్యస్తమయమయ్యాక ఖురాన్ చదువుతారు. మహమ్మద్ ప్రవక్త ఆదర్శాల గురించి చెబుతారు.
మిగతా సంస్థల్లాగా ఇక్కడ లిఖితపూర్వకమైన వ్యవస్థ ఉండదు. కానీ, పద్ధతులను కచ్చితంగా పాటిస్తారు.
జమాత్ పెద్దలు హోదాలో పైన ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను సాధారణంగా ‘అమీర్’ తీసుకుంటారు.
పాకిస్తాన్‌లోనూ అభ్యంతరాలు
ఇటవల జమాత్‌పై పాకిస్తాన్‌లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సింధ్ ప్రాంతంలోని థట్టా పట్టణంలో ఉన్న కరోనా నియంత్రణ కేంద్రానికి రెండు రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది.
మహమ్మద్ ఖాన్ సూమ్రో అనే గ్రామంలో తబ్లీగీ జమాత్‌కు చెందిన వాళ్లు ఉండటం గురించి అక్కడి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.
కేంద్రీయ బజోరా పరిషత్ ఛైర్మన్ హసన్ సుమ్రో ఈ ఫిర్యాదు చేశారు. ఆయన బీబీసీతో ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘కరోనావైరస్ వ్యాప్తి గురించి జనాలు భయపడుతున్నారు. రాయ్‌విండ్‌లో వార్షిక కార్యక్రమానికి వచ్చినవాళ్లకు వైరస్ సోకిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆందోళతోనే ఫిర్యాదు చేశాం’’ అని ఆయన చెప్పారు.
రాయ్‌విండ్‌లో మార్చి 10-12 మధ్య ఈ సమావేశం జరిగింది. దేశవిదేశాల నుంచి వేల మంది దీనికి హాజరయ్యారు.
తర్వాత వాళ్లకు అధికారులు పరీక్షలు చేశారు. రాయ్‌విండ్‌లో సమావేశం నుంచి వచ్చిన నలుగురికి కరోనావైరస్ సోకినట్లు సింధ్ ఆరోగ్యశాఖ తెలిపింది.
థట్టాతోపాటు లర్కానా జిల్లాలోని సైహర్ కుస్బే మసీదులోనూ తబ్లీగీ జమాత్‌కు చెందినవాళ్లు ఉన్నారు. అక్కడివాళ్లు కూడా దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
తబ్లీగీ జమాత్‌పై నిషేధం విధించకపోతే కరోనావైరస్ మొత్తం దేశమంతా వ్యాపిస్తుందని ఓ స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్న మసూద్ లోహార్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. దీన్ని చాలా మంది సమర్థించారు.
తబ్లీగీ జమాత్‌కు చెందినవాళ్లు ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉండాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ సస్సీ పలేజూ అభ్యర్థించారు.
దిల్లీ ప్రభుత్వ నిషేధాజ్ఞలు
అదే సమయంలో, భారత్‌లో మార్చి ఆరంభంలోనే దిల్లీ ప్రభుత్వం మతపరమైన, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలేవీ జరపకూడదని ఆదేశాలు ఇచ్చింది. మార్చి 31 వరకూ వీటిపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.
ఆ తర్వాత మార్చి 25న ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని ఉల్లంఘించేవారిపై పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షణ పెట్టారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
No comments:
Please do not enter any spam link in comment box